
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం మండలంలోని పాలెం రైతువేదికలో నిర్వహించిన వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని గుర్తించడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశించిన మిల్లులకు తరలించాలని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్, ఆర్డీఓ సుబ్రమణ్యం, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.