
శిక్షణ ఎవరికి ఇవ్వాలి?
● అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
● ఏఓ, ముగ్గురు ఏఈఓలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశం
అమరచింత: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు హాజరుకాకపోతే శిక్షణ ఎవరికి ఇస్తారంటూ జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్‌పై కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి రైతువేదికలో వరి కొనుగోళ్లపై కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు వ్యవసాయశాఖ, పీఏసీఎస్, ఐకేపీ శాఖల అధికారులు హాజరయ్యారు. శిక్షణకు ఎంతమంది నిర్వాహకులు హాజరయ్యారనే విషయాన్ని హాజరు పట్టికను పరిశీలించి తెలుసుకున్నారు. పలు కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రాకపోవడంతో ఇక్కడ ఏం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. శిక్షణకు రాకపోతే తేమశాతం ఎలా గుర్తిస్తారు, వరి ధాన్యం ఎలా కొంటారని నిలదీశారు. శిక్షణకు కేంద్రాల నిర్వాహకులను కాకుండా రైతులను ఎలా పిలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. శిక్షణకు హాజరుకాని వారితో పాటు ఏఓ అరవింద్‌తో పాటు ముగ్గురు ఏఈఓలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. మరోమారు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, గృహ నిర్మాణశాఖ డీఈ విఠోబా, జిల్లా సహకారశాఖ అధికారి రాణి, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఏడీఏ దామోదర్, తహసీల్దార్లు రవికుమార్‌యాదవ్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
ఫ్రైడే.. డ్రైడే నిర్వహించాలి..
వనపర్తి: జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తున్నందున నవంబర్ 15 వరకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో అబా కార్డుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా డెంగీ పరీక్షలు కూడా కొనసాగించాలని సూచించారు. ఏఎన్‌ఎంలతో ఎన్‌సీడీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కూడా జిల్లాలో ప్రారంభించేందుకు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంసీహెచ్‌లో ప్రెజర్ ఆక్సిజన్, ఇంక్యుబేటర్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు సాయినాథ్‌రెడ్డి, రామచందర్‌రావు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.