
అవుట్ పోస్ట్ ఏర్పాటుతో మరింత భద్రత
అమరచింత: జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటుతో ప్రజలతో పాటు డ్యాం భద్రతపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మండలంలోని పీజేపీ క్యాంపు సమీపంలో ఉన్న సత్యసాయి వాటర్ స్కీం పక్కన పోలీస్ అవుట్ పోస్టు భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.కోటితో ఆధునిక సాంకేతికతతో భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో అవుట్ పోస్టును ఏర్పాటు చేయడంతో నేరాలను నియంత్రించడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం అమరచింత పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణలో పోలీసులు ముందుండాలని, క్రైం రేట్‌ను తగ్గించాలని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఐని ఆదేశించారు. స్టేషన్ ఆవరణను ఆహ్లాదకరంగా ఉంచాలని సూచించారు. సీసీ కెమెరాలు అన్ని గ్రామాలతో పాటు పట్టణంలో ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్‌ఐ స్వాతి ఉన్నారు.
పట్టుదలతో లక్ష్యసాధన సులభమే..
వనపర్తి: పట్టుదలతో కృషి చేస్తే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం సులభమేనని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన అండర్–14 ఉమ్మడి జిల్లా సైకిల్‌రేస్ పోటీల్లో సత్తా చాటిన గోపాల్‌పేటకు చెందిన మనస్వీ, జ్ఞాపికను ఆయన అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్నవారి పిల్లల్లో ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయని.. తల్లిదండ్రులే గురువులుగా మారి మెళకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.