
బాణాసంచా విక్రయానికి అనుమతి తప్పనిసరి
వనపర్తి: దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయించే వారు సంబంధిత పోలీస్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. అక్రమంగా బాణాసంచా నిల్వచేసినా, తయారుచేసినా, దుకాణాలు నెలకొల్పినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్, ఫైర్ విభాగం, పోలీసుశాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయించాలన్నారు. రద్దీ ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, పెట్రోల్ బంకులు, వివాదాస్పద స్థలాల్లో ఏర్పాటు చేయొద్దని కోరారు. నిర్దేశిత రుసుం చెల్లించి విద్యుత్, అగ్నిమాపక, పుర అధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు.
ఎస్పీ ప్రజావాణికి 10 వినతులు
ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయములో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు సూచించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు మొత్తం 10 వినతు లు వచ్చినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు.