
వంతెన నిర్మాణంపూర్తి చేస్తాం : ఎమ్మెల్యే
మదనపురం: మండలంలోని ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన అనంతరం ఊకచెట్టు వాగులో నిర్మించిన వంతెన అప్రోచ్‌రోడ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తూ పేదలను ఆదుకుంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేసిందని మండిపడ్డారు. వంతెన నిర్మాణాన్ని కూడా పట్టించుకోలేదని.. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనుల పూర్తికి రూ.6 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. వంతెన నిర్మాణం పూర్తయితే అమరచింత, ఆత్మకూర్, చిన్నచింతకుంట, మదనాపురం, కొత్తకోట మండల ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగన్న, మహేష్ పాల్గొన్నారు.
ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ..
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు, అనంతరం చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు.
నారాయణస్వామికి స్వాగతం పలికిన నాయకులు
వనపర్తి: డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యేందుకు ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి సోమవారం రాత్రి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, నాయకులు చీర్ల చందర్, శంకరప్రసాద్, వెంకటేష్, కృష్ణబాబు, యాదయ్య, పాకనాటి కృష్ణ, కోట్ల రవి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం విలేకరుల సమావేశం, మధ్యాహ్నం తర్వాత ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.