
బాల్యానికి ‘బంధనం’
జిల్లాలో ఈ ఏడాది 30 బాల్య వివాహాలకు అడ్డుకట్ట
● సకాలంలో స్పందించిన అధికారులు
● వివాహమైన తర్వాత తెలుసుకొనిఒకరిపై కేసునమోదు
● వందరోజుల అవగాహనకార్యక్రమానికి అధికారులు సన్నద్ధం
● గ్రామ, మండలస్థాయిలో కమిటీల ఏర్పాటుకు కసరత్తు
వనపర్తి: బాలికల ఉజ్వల భవిష్యత్‌కు బాల్య వివాహాలు బంధనంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, బాధ్యులకు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా వంటి చర్యలుంటాయని తెలిసినా.. కొందరు తల్లిదండ్రులు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 30 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఒక బాల్య వివాహం జరిగిన విషయం ఆలస్యంగా తెలియడంతో కేసు నమోదు చేసి సదరు బాలికకు ప్రభుత్వ సంరక్షణలో విద్యాబుద్దులు చెప్పిస్తున్నారు. ప్రపంచ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జస్ట్ రైట్ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలను ఎంచుకొని అక్టోబర్ 11 నుంచి 2026, జనవరి 26 వరకు వందరోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఆర్డీఎస్ సంస్థ నిర్వహిస్తుండగా.. బాలికలు తమ హక్కులను వినియోగించుకోవడంలో వెనుబడిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని బాల్యవివాహాల నిర్మూలన, బడిబయటి పిల్లలను పాఠశాలలో చేర్పించనున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘ఇచ్చట బాల్య వివాహాలు నిర్వహించబడవు’ అని రాసి ఉన్న వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆదర్శ్ సురభితో ఆవిష్కరింపజేసి వీటిని ప్రతి గ్రామంలోని ఆలయాలు, చర్చీలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం..
అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలనే నిబంధనను భారత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్య సమస్యలు, శిశు మరణాలు, గర్భస్రావం, రక్తపోటు, పోషకాహార లోపం, రక్తహీనత తదితర ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రేమ వివాహాల వైపు ఎక్కడ ఆకర్శితులవుతారోనని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక చిన్న వయసులో, చదువుకునే సమయంలో వివాహాలు చేసి బరువు దించుకోవాలనే ఆలోచనతో బాల్య వివాహాలకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.