
నెలాఖరు నాటికి కేంద్రాల ఏర్పాటు
వనపర్తి: జిల్లాలో 2025–26 వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకుగాను నెలాఖరు నాటికి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. సోమవారం ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌తో పాటు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథం, పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ పీడీ ఉమాదేవి పాల్గొని వివరాలు వెల్లడించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెలాఖరు నాటికి పంటలు కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. ఆలోగా కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో కావాల్సిన సామగ్రితో పాటు గన్నీ బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే, బరువు, తేమ కొలిచే యంత్రాలతో పాటు డిజిటల్ కాలిపర్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం తడవకుండా కావాల్సినన్ని టార్పాలిన్లు సమకూర్చుకోవాలని, సన్న, దొడ్డు రకం ధాన్యం సేకరణకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్రాల నిర్వాహకులకు శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీసీఓ రాణి, డీటీఓ మానస, డీఏఓ ఆంజనేయులుగౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్