
చదువుతోనే ఉన్నత శిఖరాలకు..
వనపర్తి టౌన్: బాలికలు జీవితంలో వేసే ప్రతి అడుగు బంగారు భవిష్యత్‌వైపే ఉండాలని.. ఎంచుకున్న లక్ష్యాలను సాధించి, సమాజంలో ఉన్నతంగా రాణించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని ఆకాంక్షించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్టీ బాలికల వసతిగృహంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాటలు, చిత్రలేఖనం, ఉపన్యాస, నృత్య పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తుండగా.. మారుమూల గ్రామాల్లో బాలికలు, మహిళలను అణిచివేస్తూ వంటింటి కుందేళ్లుగా మారుస్తూనే ఉన్నారని విస్మయం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలతో బాలికల జీవితం నాశనం అవుతుందని, వారిని చదివిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని చెప్పారు. బాలికలు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో గౌరవం దక్కాలంటే చదువు, ఆలోచన, ఆచరణతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ఎప్పటికీ గుర్తించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ శ్రీదేవి, వసతిగృహ నిర్వాహకురాలు పద్మజ, పారా లీగల్ వలంటీర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
పాన్‌గల్: విద్యుత్‌శాఖలో ఔట్‌సోర్సింగ్ (స్పాట్ బిల్లర్) ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందిన మండల కేంద్రానికి చెందిన మధుసూదన్‌యాదవ్ కుటుంబానికి శనివారం ఏడీ రాజయ్యగౌడ్, ఏఈ చందన్‌కుమార్‌రెడ్డి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధుసూదన్‌యాదవ్ మృతి బాధాకరమని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రులకు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏఓ భాస్కర్‌రెడ్డి, ఎల్‌ఐ వెంకటస్వామి, రామకృష్ణ, కాంగ్రెస్‌పార్టీ మండల నాయకులు రాముయాదవ్, నర్సింహ, ఆంజనేయులు, వెంకటేష్, ప్రవీణ్‌రెడ్డి, కుశాల్, హన్మంతు, మన్యం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

చదువుతోనే ఉన్నత శిఖరాలకు..