
మత్తు రహిత జిల్లాగా మారుద్దాం
● అసాంఘిక కార్యక్రమాల
నియంత్రణపై దృష్టి
● దసరా సెలవుల్లో దొంగతనాలు
జరగకుండా చూడాలి
● నేర సమీక్షలో ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా అధికారులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలతో నెలవారి నేరసమీక్ష నిర్వహించి పెండింగ్ కేసులపై చర్చించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించాలని, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, రిపోర్టులు, మెడికల్ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి ఛేదించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడానికి సహకరించిన ప్రజలకు, కృషి చేసిన సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా రానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ఉత్సవాల్లో డీజేలు వినియోగించకుండా చూడాలని, మండపాల వద్ద రాత్రిళ్లు నిర్వాహకులు ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి అధికారి పూర్తిస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రజలు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని, రౌడీలు, సస్పెక్ట్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠిన చర్యలతో కట్టడి చేయాలని సూచించారు. దసరా సెలవుల్లో చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్తుంటారని.. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు కాబట్టి దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని కోరారు. సమీక్షలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణయ్య, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, డీసీఆర్బీ, ఐటి కోర్, కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.