
స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలి
వనపర్తి: గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచగలిగినప్పుడే జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛమైన ఆరోగ్య భారతావనిని నిర్మించగలమని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. స్వచ్ఛతా హి సేవా–2025లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. శనివారం ఉదయం లీడ్ బ్యాంక్ కార్యాలయం, జిల్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అమ్మ చెరువు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడికి వచ్చిన అధికారులు, ప్రజలు, అగ్నివీర్ శిక్షణ అభ్యర్థులు తదితరులతో కలిసి ప్లాస్టిక్, చెత్త రహిత సమాజాన్ని నిర్మించేందుకు స్వచ్ఛతను పాటిస్తూ తోటి వారికి సైతం పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఉన్న చెత్త, ప్లాస్టిక్ కవర్లను తొలగించి ట్రాక్టర్‌లో డంపింగ్‌యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల శుభ్రతతో అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కరగకుండా, నీటిలో కలిసిపోకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తోందని.. ప్రజలు వాటి వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతేగాకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లు, కాల్వల్లో వేయకుండి తడి, పొడిగా వేరు చేసి మున్సిపాలిటీ వాహనాల్లో వేయాలని సూచించారు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జల్, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, సహాయ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు.

స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలి