
నేడు బైక్ ర్యాలీ : సీపీఎం
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కూలీలు, కార్మికుల అడ్డాల దగ్గర ర్యాలీపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు వనపర్తి అంబేడ్కర్ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. 1948, సెప్టెంబర్ 17 వరకు నిజాం రాజ్యంగా ఉందన్నారు. సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ విలీనమైనందున విలీన దినాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు బాబు, లక్ష్మన్న, నర్సింహ, సిద్ధు, బీసన్న, నాగన్న, సూరి, దొరస్వామి, లింగస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్స్ చెల్లించాలని విద్యార్థుల ఆందోళన
వనపర్తి: బకాయి ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ వచ్చి మాట్లాడాలని విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు పట్టుబట్టారు. ఏఓ భానుప్రకాష్ విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. వారు గేట్ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకొని అక్కడే కూర్చోబెట్టారు. సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు శాంతించారు.
మంత్రి పొన్నంను
కలిసిన ఎమ్మెల్యే
కొత్తకోట రూరల్: పట్టణంలోని వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. పక్కా భవనాల నిర్మాణాలకు కృషి చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్‌జే బోయేజ్, పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు మేసీ్త్ర శ్రీనివాసులు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి మంగళవారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వసతిగృహ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, అంచనాలు సిద్ధం చేసి తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. అడిగిన వెంటనే ఎమ్మెల్యే స్పందించినందుకుగాను స్థానిక కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

నేడు బైక్ ర్యాలీ : సీపీఎం

నేడు బైక్ ర్యాలీ : సీపీఎం