
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
● మూడుముళ్ల బంధంతో బాలల భవిష్యత్ నాశనం చేయొద్దు
● ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి: బాల్యవివాహాలకు బాధ్యులైన తల్లిదండ్రులు, బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకోవాల్సిన వయసులో ఆడపిల్లలను పెళ్లి పీటలు ఎక్కించి వారి బంగారు భవిష్యత్‌ను నాశనం చేయొద్దన్నారు. ఆడపిల్లలను ఎప్పుడూ ఇంటికి భారంగా అనుకోవద్దని అన్నారు. 18ఏళ్లు నిండని బాలికలు కుటుంబ బాధ్యతలు స్వీకరించే స్థితిలో కూడా ఉండరని.. శారీరకంగా బలంగా ఉండకపోవడం వల్ల దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ఆడపిల్లలను ఉన్నతంగా చదివించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని సూచించారు. జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా వీల్లేదన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు చేసేందుకు యత్నిస్తే బాధ్యులైన తల్లిదండ్రులతో పాటు బంధువులు, పూజారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాల్యవివాహాల నియంత్రణ కోసం గ్రామస్థాయిలో బాలల సంరక్షణ కమిటీ (వీసీపీసీ), మండల బాలల పరిరక్షణ కమిటీ (ఎంసీపీసీ) ఏర్పాటుచేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణకు హెల్ప్‌లైన్ నంబర్ 1098 నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా బాలికలు, మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తే కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
జాతీయ లోక్‌అదాలత్‌లో 2,737 కేసుల పరిష్కారం..
జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదై కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 171, డ్రంకెన్ డ్రైవ్, మోటార్ వెహికిల్ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 514, సైబర్ క్రైం 45 కేసుల్లో రూ. 15,10,698 బాధితుల అకౌంట్‌కు రీఫండ్ చేయడం జరిగిందని ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. 15 రోజుల నుంచి పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది ఆయా కేసుల్లోని కక్షిదారులను స్వయంగా కలిసి జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ అయ్యేలా అవగాహన కల్పించినట్లు తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 2,737 కేసులను పరిష్కరించడం జరిగిందని.. ఈ కేసుల పరిష్కారంలో చక్కగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.