ఆగుతూ.. సాగుతూ...! | - | Sakshi
Sakshi News home page

ఆగుతూ.. సాగుతూ...!

Sep 7 2025 9:01 AM | Updated on Sep 7 2025 9:01 AM

ఆగుతూ

ఆగుతూ.. సాగుతూ...!

జిల్లాలో నత్తనడకన విద్యార్థుల వివరాల నమోదు

ఏజెన్సీకి అప్పగింత.. పాఠశాలల్లోనే ఆన్‌లైన్‌ చేస్తున్న ఆపరేటర్లు

పూర్తిస్థాయి నమోదే లక్ష్యంగా ముందుకు..

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలస్యం

వనపర్తి టౌన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల వివరాల ఆన్‌లైన్‌ నమోదుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ విధానంతో విద్యార్థుల సంఖ్య పక్కాగా నిర్ధారణ అవుతుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు జిల్లాలో ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ వేగవంతం చేసేందుకు ఎస్‌ఎన్‌ఆర్‌ ఏజెన్సీతో రాష్ట్ర ఉన్నతాధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏజెన్సీ ప్రతి మండలానికి ఒకటి, పెద్ద మండలాలకు 2, 3 చొప్పున ఆపరేటర్లను నియమించి ఆయా మండలాల్లో ప్రధాన పాఠశాల సమీపంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమీప ప్రాంత విద్యార్థుల వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ఏజెన్సీ ఆపరేటర్లు విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, వేలిముద్రలు, ఆధార్‌ నంబర్‌, తరగతి, పుట్టిన తేదీ, ఫోన్‌నంబర్‌, ఐరీష్‌ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆపరేటర్‌ రోజు సగటున 30 మంది విద్యార్థుల వివరాలు బయోమెట్రిక్‌ యంత్రంలో నమోదు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల వివరాలను ఆపరేటర్లు నమోదు చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో వివరాల నమోదు కొనసాగుతుండగా.. మరికొన్ని మండలాల్లో ప్రారంభించాల్సి ఉంది.

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 754 ఉండగా.. 91,830 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 5,537 మంది విద్యార్థులకు ఆధార్‌ నమోదు లేకపోవడం గమనార్హం. ఇందులో వనపర్తిలో 1,253, శ్రీరంగాపురంలో 174, ఆత్మకూర్‌లో 813, పెబ్బేరులో 667, వీపనగండ్లలో 121, పానగల్‌లో 245, కొత్తకోటలో 723, చిన్నంబావిలో 149, అమరచింతలో 270, గోపాల్‌పేటలో 226, మదనాపురంలో 195, పెద్దమందడిలో 276, రేవల్లిలో 108, ఖిల్లాఘనపురంలో 247, ఏదులలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. అడ్మిషన్‌ రిజిస్టర్‌, యూడైస్‌లో ఆధార్‌కు అనుగుణంగా 25,608 మంది విద్యార్థుల వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్‌, బయోమెట్రిక్‌, ఐరిష్‌ పూర్తిస్థాయిలో అనుసంధానం కాని విద్యార్థులు 5,843 మంది ఉన్నారు. పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ అయిన విద్యార్థులు 54,844 మంది మాత్రమే ఉన్నారు. విద్యార్థి పేరు, ఆధార్‌తో పూర్తిస్థాయిలో మ్యాచ్‌ అయిన విద్యార్థులు 69,726 మంది మాత్రమే ఉన్నారు.

కచ్చితంగా నమోదు..

విద్యార్థులకు తప్పనిసరిగా ఆధార్‌ గుర్తింపు ఉండాలి. ఆధార్‌ ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ నమోదు చేయించుకోవాలి. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఆధార్‌ సేవలను విద్యార్థులకు చేరువ చేశాం. త్వరలోనే అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తాం. డీఈఓ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. – శ్రీధర్‌రెడ్డి, అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారి

ఆగుతూ.. సాగుతూ...! 1
1/1

ఆగుతూ.. సాగుతూ...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement