
‘సర్వేపల్లి’ జీవితం ఆదర్శం
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి
వనపర్తి: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను విద్యాపరంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శం కావాలని.. తన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకోవాలని సూచించడం ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకం చేపట్టిందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందన్నారు. జనాభా సర్వే, ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు పనిచేస్తే అందరికీ ఒక నమ్మకం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో రెండు జిల్లాలను విద్యాపరంగా ఉత్తమ జిల్లాలుగా గుర్తించారని.. అందులో వనపర్తి లేకపోవడం బాధ కలిగించిందన్నారు. విద్యాపర్తిగా పేరున్న వనపర్తిని రానున్న రోజుల్లో చదువులో ఉత్తమంగా తీర్చిదిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు సృజనాత్మకత, నైతిక విలువలు నేర్పిస్తూ సమాజానికి మేలు చేసేలా తీర్చిదిద్దాలన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు బోధనతో పాటు శాస్త్రవేత్తల గురించి చెప్పి వారి మనసును ఆకర్షించాలని, అప్పుడే చదువుపై శ్రద్ధ చూపుతారని తెలిపారు. పోలీస్‌శాఖ నుంచి విద్యార్థులకు తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతకుముందు విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకంగా నిలిచిన బోనాల పండుగ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 63 మందికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో పాటు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య, జిల్లా విద్యాధికారి మహ్మద్ ఘనీ, ఏసీజీఈ గణేష్, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.