
యూరియా తిప్పలు తప్పేదెన్నడో..?
పాన్‌గల్: మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయానికి యూరియా వచ్చిందనే విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు శనివారం ఉదయమే భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. 600 బస్తాల యూరియా రాగా.. మూడురోజుల కిందట టోకన్లు తీసుకున్న రైతులు ఒకపక్క, టోకన్లు లేని రైతులు మరోపక్క పెద్ద సంఖ్యలో గుమిగూడారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టోకన్లు, యూరియా పంపిణీ చేపట్టారు. మూడురోజుల కిందట పంపిణీ చేసిన టోకన్లలో ఇంకా 416 మందికి, కొత్తగా 390 మందికి టోకన్లు పంపిణీ చేయడంతో మొత్తం 806 మంది రైతులకు యూరియా ఇవ్వాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. రోజు యూరియా పంపిణీ చేస్తున్నా.. రైతుల రద్దీ మాత్రం తగ్గడం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. యూరియా కోసం ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు తీసుకొచ్చి రోడ్డుపైనే నిలపడంతో మీ–సేవా కేంద్రాలు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు, సిబ్బంది తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపి కార్యాలయానికి నడిచి వెళ్లడం కనిపించింది.
ఆత్మకూర్: పట్టణంలోని పీఏసీఎస్‌కు శనివారం ఉదయమే వివిధ గ్రామాల రైతులు తరలివచ్చి చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలను వరుసలో ఉంచి పడిగాపులు పడటం కనిపించింది. మధ్యాహ్నం 300 సంచుల యూరియారాగా పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుస క్రమంలో నిలబెట్టి 140 మందికి 300 బస్తాలు పంపిణీ చేశారు. మిగిలిన 200 మంది రైతులకు టోకన్లు అందించామని.. సోమవారం యూరియా అందిస్తామని ఏఓ వినయ్‌కుమార్, సీఈఓ నరేష్ తెలిపారు.

యూరియా తిప్పలు తప్పేదెన్నడో..?