
గణపతి లడ్డు @ రూ.8,00,116
వనపర్తి: జిల్లాకేంద్రంలోని రాజమహల్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి నిమజ్జనం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. అంతకుముందు లడ్డుకు వేలం నిర్వహించారు. పదకొండు రోజుల పాటు వినాయకుడితో పాటు పూజలందుకు లడ్డును రాజస్థాన్‌కు చెందిన బంగారు వ్యాపారి సమధాన్ రూ.8,00,116కు వేలంలో దక్కించుకున్నారు. జిల్లాలో ఇంత పెద్దమొత్తంలో వినాయకుడి లడ్డు వేలం పాట పాడటం ఇదే ప్రథమమని స్థానికులు చర్చించుకుంటున్నారు, సామాజిక మాద్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి రూరల్: జిల్లాలోని పెద్దగూడెం శివారు ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ బీఎస్సీ (హానర్స్) వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఇంజనీరింగ్, ప్లాంట్ పాథాలజీ బోధించేందుకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్‌లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులైన వారు అర్హులని.. పీహెచ్‌డీ, నెట్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతల నిజ ధ్రువపత్రాలు, ఒక సెట్ జిరాక్స్ కాపీ, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, పూర్తి బయోడేటాతో ఈ నెల 10న పెద్దగూడెం శివారు వ్యవసాయ కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
‘ఏఈఓలకు
పనిభారం తగ్గించాలి’
వనపర్తి రూరల్: తమపై పని భారం తగ్గించాలంటూ శనివారం కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని ఏఈఓలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఏఈఓలు మాట్లాడుతూ.. పని ఒత్తిడి కారణంగా కామారెడ్డి జిల్లా డోగ్లీ మండల ఏఈఓ బస్వరాజు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడన్నారు. ఈ సందర్భంగా అతడి చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాల వేసి నివాళులర్పించారు. డిజిటల్ క్రాప్ సర్వేతో పాటు 49 రకాల విధులు నిర్వర్తిస్తుండటంతో పని ఒత్తిడి పెరిగి రోగాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పని భారం తగ్గించాలని, తగిన సమయం ఇవ్వాలని కోరారు. మృతిచెందిన ఏఈఓ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఈఓలు నందకిశోర్, యు గంధర్, మోహన్, సాయిరెడ్డి, అభిలాష్, సంతోష్, శైలజ, కవిత, హరితారెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులే దేశానికి
వనరులు
కొత్తకోట రూరల్: విద్యార్థులు దేశానికి అపార వనరులని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి అన్నారు. 2025 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం అందించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మోజర్ల ఉద్యాన కళాశాల అధ్యాపకులు డా. షహనాజ్ అందుకున్న సందర్భంగా కళాశాలలో అభినందించి మాట్లాడారు. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన గుణాత్మక విద్య అందించేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. మెరుగైన ఆవిష్కరణలతో రాష్ట్రంలోని ఉద్యాన రైతులు పంటల సాగు లాభసాటిగా మార్చేందుకు ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.