
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
కొత్తకోట రూరల్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జ్వరంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ డెంగీ పరీక్షలు నిర్వహించాలని, ర్యాట్ పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయితే రక్త నమూనాను ఎలిజా పరీక్షకు పంపించాలని వైద్యులకు సూచించారు. వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతో మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు, కేజీబీవీలు, అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత, సమస్యలు ఉంటే ప్రతిపాదనలు అందించా లని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం, గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, వైద్యాధికారులు ఉన్నారు.