
పారదర్శకంగా దివ్యాంగులకు ఉపకరణాల ఎంపిక
వనపర్తి: తెలంగాణ దివ్యాంగుల సహాకార కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలను అందించేందుకు అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో లైన్ డిపార్ట్‌మెంట్ అధికారుల సహాయంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు అదనపు కలెక్టర్ యాదయ్య హాజరయ్యారు. జిల్లాలోని 215 మంది దివ్యాంగులు ఉపకరణాల కోసం ఇది వరకే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోగా.. వాటిని సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. జిల్లాకు రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ 40 మంజూరు చేయగా.. 136 దరఖాస్తులు వచ్చాయన్నారు. బ్యాటరీ వీల్‌చైర్లు 12 మంజూరు కాగా.. 14 దరఖాస్తులు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు 16 మంజూరు చేయగా 14 దరఖాస్తులు, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వాహనం ఒకటి మంజూరు కాగా 26 దరఖాస్తులు, హైబ్రిడ్ వీల్‌ఛైర్ 4 మంజూరు కాగా 8 దరఖాస్తులు, ల్యాప్‌టాప్‌లు 14 మంజూరు కాగా 6 దరఖాస్తులు, ఉన్నత విద్య కోసం ల్యాప్‌ట్యాప్‌లు 6 మంజూరు కాగా 6 దరఖాస్తులు, 5జీ స్మార్ట్‌ఫోన్స్ 2 మంజూరు కాగా 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. ట్యాబ్స్ 10 మంజూరు కాగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఆయా ఉపకరణాల పంపిణీ కోసం అర్హులైన దరఖాస్తుదారుల నుంచి ధ్రువపత్రాలను పరిశీలన చేసి పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, రవాణా శాఖ అధికారిని మానస, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.