
మహిళలే మహారాణులు
వనపర్తి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తర్వాత ఆ స్థాయిలో మహిళలకు సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో మంజూరవుతున్నాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఇందిరా మహిళాశక్తి విజయోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్‌జీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మహిళా సంఘాల సభ్యుల సమావేశాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని, మరో 7 వేల ఇళ్లు కావాలని సీఎంను కోరినట్లు తెలిపారు. శ్రావణమాసం రానుందని, ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఆడపడుచు లాంఛనాలతో నియోజకవర్గంలోని మహిళలతో నూతన గృహప్రవేశం చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి తొలి సంబరాల సమావేశం వనపర్తిలో నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యంలోనే సాకారమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాకు రూ. 9కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీలో అద్దె బస్సులు, పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మహిళలను సీఎం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా మహిళా సంఘాల సభ్యులకు రూ. 38.80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
మహిళా ఆర్థిక స్వావలంబనకు కృషి
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్‌సురభి చెప్పారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకొస్తే రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తామని, పలు రకాల వ్యాపారాలు చేసేందుకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలోనే జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్‌గౌడ్, డీఆర్‌డీఓ ఉమాదేవి, పీసీసీ సభ్యుడు శంకరప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సంధ్యారాణి, మహిళా సంఘాల సభ్యులు నిర్మల, స్వప్న, ఇందిరా, మహేశ్వరి, శాంతమ్మ, శ్రీలత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆడపడుచు లాంఛనాలతో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేయిస్తా..
మళ్లీ రాజన్న పాలన వచ్చింది
రూ.38.80 కోట్ల చెక్కుల అందజేత
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి