
అధ్వానం.. పల్లె ప్రకృతి వనం
గోపాల్‌పేట: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో 10 గుంటల నుంచి ఎకరం వరకు ప్రభుత్వ స్థలాన్ని సేకరించి భారీ సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు ఉదయపు నడక కోసం వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసింది. ప్రారంభంలో నిర్వహణ బాధ్యతను ఉపాధి కూలీలకు అప్పగించగా.. వారు ఆయా వనాల్లో కలుపు తీయడం, నీరు పట్టడం వంటి పనులు చేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించారు. దీంతో సిబ్బందికి అదనపు పనులు కావడంతో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా తయారయ్యాయి. పలు ప్రకృతి వనాల్లో కలుపు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని గోపాల్‌పేట మండలంలో 15, రేవల్లిలో 12, పెద్దమందడిలో 22, కొత్తకోటలో 22, పాన్‌గల్‌లో 28, వీపనగండ్లలో 14, ఖిల్లా ఘనపురంలో 27, వనపర్తి రూరల్ 26, చిన్నంబావిలో 17, అమరచింతలో 14 ఇలా మొత్తం 319 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రకృతి వనం ఏర్పాటుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు రూ.రెండు లక్షల వరకు వెచ్చించారు. కేటాయించిన స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటడంతో పాటు చుట్టూ కంచె ఏర్పాటు చేసి గేటు బిగించి పల్లె ప్రకృతి వనాలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక నాటిన మొక్కలు కనిపించకపోగా పిచ్చి మొక్కలతో నిండి దర్శనమిస్తున్నాయి.
● రేవల్లిలోని పల్లె ప్రకృతి వనాన్ని పట్టించుకోకపోవడం, గేటుకు తాళం వేసి ఉంచడంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. బయటి నుండి సైతం ముళ్లపొదలు పెరిగి ప్రకృతి వనం కనిపించకుండా అయింది.
● గోపాల్‌పేటలో మండల కేంద్రం పల్లె ప్రకృతి వనంతో పాటు పక్కనే ఉన్న ధన్‌సింగ్ తండాకు చెందిన పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడం, పర్యవేక్షించేవారు కనిపించకపోవడంతో స్థానికులు బహిర్భూమికి వినియోగిస్తున్నారు.
● వీపనగండ్ల మండలంలో గోపాల్‌దిన్నె, కల్వరాల, బొల్లారం గ్రామాల్లోని ప్రకృతి వనాలు పిచ్చి మొక్కలతో నిండి నిరుపయోగంగా మారాయి. అలాగే మరికొన్ని చోట్ల యువత మద్యం తాగడానికి, సిగరేట్లు కాల్చేందుకు వినియోగించుకుంటున్నారని ఆయా గ్రామస్తులు వివరించారు. రూ.కోట్ల ప్రజాధనంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పిచ్చి మొక్కలతో నిండిన
రేవల్లి పల్లె ప్రకృతి వనం
నిర్వహణకు నిధులు కరువు
పట్టించుకోని పాలకులు, అధికారులు
జిల్లావ్యాప్తంగా 319 ఏర్పాటు
కొన్ని గ్రామాల్లో బహిర్భూమికి
వినియోగిస్తున్న వైనం
పిచ్చి మొక్కలు మొలిచాయి..
మండల కేంద్రానికి చెందిన పల్లె ప్రకృతి వనాన్ని పాలమూరు రంగారెడ్డి కాల్వ సమీపంలో గ్రామానికి దూరంగా ఏర్పాటు చేశారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. గేటుకు తాళం వేసి ఉంచారు. ఉపాధి, గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకొని శుభ్రంగా చేస్తే బాగుంటుంది. అధికారులు ఆ దిశగా కృషి చేయాలి. – బంగారు శ్రీనివాసులు, రేవల్లి
నిర్వహణ మరిచారు..
గత ప్రభుత్వంలో ప్రజలు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాధించేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. అప్పట్లో ఉపాధి సిబ్బంది నిర్వహణ చూసేవారు. ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయాయి. జిల్లా అధికారులు స్పందించి అందుబాటులోకి తీసుకురావాలి. – బాలరాజు, గోపాల్‌పేట
తగిన చర్యలు తీసుకుంటాం..
పల్లె ప్రకృతి వనాలను అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తే ఊరుకోం. గ్రామాల వారీగా అధికారులతో పరిశీలన జరిపి నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామపంచాయతీ సిబ్బందితో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు తొలగిస్తాం.
– రఘునాథ్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

అధ్వానం.. పల్లె ప్రకృతి వనం

అధ్వానం.. పల్లె ప్రకృతి వనం

అధ్వానం.. పల్లె ప్రకృతి వనం