
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
వనపర్తి: వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. టోల్‌ఫ్రీ నంబర్ల 08545–233525, 08545–220351కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపాయకర పరిస్థితులు, ముంపు ప్రమాదం, ఇతర సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎత్తిపోతల పథకాలకు నీటి తరలింపు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం సముద్ర మట్టానికి పైన 1,019 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వలో 770 క్యూసెక్కులు, సమాంతర కాల్వలో 525 క్యూసెక్కుల వరద కొనసాగుతుందని.. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 700 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 782 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
వనపర్తి రూరల్: పెబ్బేరులో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సీఐటీయూ జిల్లా 4వ మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి ర్యాలీగా జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి చేరుకొని డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులుకు బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఆశా కార్యకర్తలను అనుమతించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా మహాసభలకు ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, పుర, గ్రామపంచాయతీ కార్మికులు, ఐకేపీ వీఓఏలు, మెప్మా ఆర్పీలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు, తదితర శాఖల్లో పని చేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.సునీత, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గంధం మదన్, జిల్లా కమిటీ సభ్యులు నందిమళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.