
బైరోజు, పోల్కంపల్లికి రాష్ట్రస్థాయి పురస్కారాలు
వనపర్తి టౌన్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ బుధవారం ప్రకటించిన రాష్ట్రస్థాయి పురస్కారాలకు పట్టణానికి చెందిన ప్రముఖ నవల రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, శిల్పి విభాగంలో ప్రముఖ శిల్పి, సాహితీవేత్త, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్ ఎంపికయ్యారు. ఈ నెల 19న ఒక్కొక్కరికి రూ.20,116 నగదు, పురస్కారాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్, సాహితీవేత్తలు వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, జనజ్వాల, సూర చంద్రశేఖర్, గోపీనాథ్, గంధం నాగరాజు, శ్యాంసుందర్, బండారు శ్రీనివాస్, రాములు హర్షం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
అమరచింత: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విఠోభా కోరారు. బుధవారం పుర కార్యాలయంలో కమిషనర్ నాగరాజుతో కలిసి వార్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణానికి 55 ఇళ్లు మంజూరయ్యాయని, ప్రోసీడింగ్ పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 18 మంది ఇళ్ల మార్కింగ్ చేసుకొని పనులు ప్రారంభించారని వార్డు అధికారులు వెల్లడించారు. మిగిలిన లబ్ధిదారులు కూడా పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలని పీడీ కోరారు. పుర మేనేజర్ యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు.
తండాల్లోని సమస్యలు పరిష్కరించాలి
పాన్‌గల్: జిల్లాలోని పలు గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్ కోరారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, మల్లాయిపల్లితండాలో పర్యటించి ఆయా తండావాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తండాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, మూతబడుతున్న పాఠశాలలను తెరిపించాలన్నారు. అర్హులకు గిరిజన కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని.. తండాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. గతంలో పలుమార్లు జిల్లా అధికారులకు సమస్యల వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని.. పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే గిరిజనులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాబునాయక్, రవినాయక్, చిట్టెమ్మ, కిషన్, సక్రూ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

బైరోజు, పోల్కంపల్లికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

బైరోజు, పోల్కంపల్లికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

బైరోజు, పోల్కంపల్లికి రాష్ట్రస్థాయి పురస్కారాలు