
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వివరాలు ఆన్‌లైన్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయాలని ఆరోగ్యశ్రీ సీఈఓ పి.ఉదయ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా పర్యటనకు రాగా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వైద్య కళాశాలను సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మాత, శిశు వైద్యశాలపై ప్రిన్సిపాల్ కిరణ్మయి ప్రొజెక్టర్ ద్వారా ప్రస్తుతం ఉన్న వసతులు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి వివరించారు. ప్రొఫెసర్లు, అసోసియట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉందని, విద్యార్థులు ట్రాన్స్‌పోర్టేషన్, క్యాడవర్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సీఈఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి వసతులు, డయాలసిస్ చేయించుకునే వారి వివరాలు, సమస్యలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ఆరోగ్యశ్రీ సిబ్బందితో మాట్లాడి రోజు ఎన్ని క్లెయిమ్స్ చేస్తున్నారు? వస్తున్న అవుట్ పేషంట్ల సంఖ్య ఎంత.. ఉదయాన్నే విధులకు రాగానే ఎవరు ఏయే పనులు చేస్తున్నారనే వివరాలు ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే కాకుండా అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందించడం.. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరగాలన్నారు. ఆస్పత్రిలోని అన్ని పడకలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా మెడికల్ కో–ఆర్డినేటర్ డా. రమాదేవి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాల నమోదు తప్పనిసరి
ఆరోగ్యశ్రీ సీఈఓ పి.ఉదయ్‌కుమార్