
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలి
కొత్తకోట రూరల్: రైతులు ఆయిల్‌పామ్ సాగుచేసేలా అధికారులు ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలో రైతులు నాగరాల తిరుపతిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి పొలాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులతో మాట్లాడి ఎకరాకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత దిగుబడి వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గెలలను పరిశీలించి అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 2025–26 సంత్సరంలో జిల్లాలో 3,500 ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించారని.. అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని రైతులకు కావాల్సిన డ్రిప్ పరికరాలు, మొక్కలను అందించాలని కోరారు. జిల్లాలోని 15 మంది రైతులు 41 ఎకరాల్లో మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, ఉద్యాన అధికారి వి.విజయభాస్కర్, అధికారులు ఎన్.సురేష్, ఆర్.కృష్ణ, మండల వ్యవసాయ అధికారి జాస్మిన్, ఏఈఓ రవీందర్‌రెడ్డి, ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ అధికారి, ఏరియా మేనేజర్, డ్రిప్ కంపెనీ అధికారులు, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బీచుపల్లియాదవ్, రైతులు హరీశ్‌రెడ్డి, బుచ్చన్న, మాదన్న, మోహన్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నిర్మాణాలకు శంకుస్థాపన..
కొత్తకోట: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణాలకు సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.33 లక్షల వ్యయంతో భవనాలు నిర్మిస్తున్నామని, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లను ఆధునికీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మండల విద్యాధికారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.