
జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 73.521 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 86.948 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు. రెండు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 160.469 మి.యూ విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి ఉపయోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు.
రామన్‌పాడులో తగ్గిన నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్ర మట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 150 క్యూసెక్కుల నీరు పారుతుండగా.. సమాంతర కాల్వకు సరఫరా లేదన్నారు. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 610 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
కోయిల్‌సాగర్ @ 20.6 అడుగులు..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 20.6 అడుగులకు చేరింది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి ఒక పంపును రన్ చేసి నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో రోజుకు కొంత మేర నీటిమట్టం పెరగుతుంది. జూరాల నుంచి నీరు రాక ముందు 11అడుగులుగా ఉన్న నీటిమట్టం 9.6 అడుగులు పెరిగి 20.6 అడుగులకు చేరింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు ఉండగా మరో 6 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి నీటిమట్టం చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లేవల్ వరకు నీటిమట్టం 32.6 అడుగులు ఉండగా మరో 12 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఈ ఏడాది జూన్ చివరి వరకే నీటిమట్టం బాగా పెరగడం ఇదే మొదటిసారి.