
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఎం
పాన్‌గల్: మండలంలోని రేమద్దులలో రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో రహదారి విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న పేదలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామ కొత్త చెరువు అలుగు వద్ద వంతెన నిర్మాణంతో పాటు నల్లకుంట వరకు సీసీ రహదారి నిర్మించాలని కోరారు. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మిగిలినవి అమలు చేయాలన్నారు. పేదలకు న్యాయం చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటయ్య, భగత్, ఎం.వెంకటయ్య, ఖాజా, మల్లేష్, భాస్కర్, నిరంజన్, భాస్కర్‌గౌడ్, తిరుపతయ్య, బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్‌లో 11 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్‌హౌస్‌ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్ సాగర్‌కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు.

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : సీపీఎం