వనపర్తి: జిల్లాకేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లో అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లను బుధవారం సీజ్ చేసినట్లు డీఈఎంఓ రామకృష్ణ తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు జిల్లాలో అనుమతి లేకుండా, అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నామని.. పెద్దమందడి మండలం బలిజపల్లిలో రెండు, జిల్లాకేంద్రంలోని గాంధీచౌక్‌లో రెండు ఆస్పత్రులను సీజ్ చేసినట్లు వివరించారు. అక్రమంగా ఆస్పత్రులు నిర్వహించడంతో పాటు అర్హతకు మించి వైద్యం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఈఎంఓ హెచ్చరించారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి వారితో కలిసి ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మె వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వివరించారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు అధికసంఖ్యలో సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ వరుణ్‌కుమార్, శేఖర్, సైదాబేగం, భారతి, మణెమ్మ, లక్ష్మి, రాజేశ్వరి, శివలీల, అంజనమ్మ, శ్రీగంగ, శోభ, సుధ, రమ్య, శారద, జయలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇంటి ఆవరణలోకి మొసలి
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం మండలం కంభాళాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈశ్వర్ ఇంటి ఆవరణలో మొసలి కనిపించింది. అతను చూసి చుట్టుపక్కల వారిని పిలిచి వారి సాయంతో మొసలిని తాళ్లతో బంధించారు. సుమారు 6 అడుగుల పొడవు, 60 కిలోల బరువు ఉంటుందని.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తీసుకెళ్లినట్లు ఈశ్వర్ వివరించారు.

నాలుగు క్లినిక్‌లు సీజ్