
పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు 29వ తేదీ వరకు జరగనుండగా.. మొదటి సంవత్సరం పరీక్షలకు 3,631 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,092 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్, సమయానికి బస్సులు నడపాలని సూచించారు. ప్రతి కేంద్రంలో మౌలిక వసతులతో పాటు ప్రథమ చికిత్స కిట్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను నియమించాలని వైద్యాధికారిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాల్లో పోలీసు గస్తీతో పాటు పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చూడాలన్నారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించవద్దని, చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. డీఐఈఓ అంజయ్య మాట్లాడుతూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 45 వినతులు..
ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అర్జీదారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ద్వారా జిల్లాకు సంబంధించిన వచ్చిన ఫిర్యా దుల తో పాటు జిల్లా ప్రజావాణి వినతులను ఎప్ప టికప్పుడు పరిష్కరించాలన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 45 వినతులు వచ్చినట్లు కలెక్టరేట్ కా ర్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.