భవిష్యత్‌ ఆయిల్‌పాం సాగుదే.. | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ ఆయిల్‌పాం సాగుదే..

May 14 2025 12:40 AM | Updated on May 15 2025 3:57 PM

వనపర్తి రూరల్‌: ఆయిల్‌పాం సాగుకు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో బోయిని వాసు సాగుచేసిన ఆయిల్‌పాం తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. భవిష్యత్‌ తరాల ప్రయోజనాల కోసం ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించామని చెప్పారు. దీర్ఘకాలం ఆదాయం పొందడంతో పాటు అంతర్గతంగా ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ శారద, నాయకులు ఆవన్ననాయుడు, చిట్యాల రాము, నర్సింహ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

18న చెస్‌ పోటీలు

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌ 9, 11 బాలలకు చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విస్‌ లీగ్‌ పద్ధతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోటీలు జరుగుతాయని.. మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాలలు పోటీలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు (సెల్‌నంబర్‌ 97034 62115), కోశాధికారి టీపీ కృష్ణయ్య (సెల్‌నంబర్‌ 99591 54743) సంప్రదించాలని సూచించారు.

రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. మంగళవారం నాటికి జలాశయంలో సముద్ర మట్టానికిపైన 1,015 అడుగులు ఉందన్నారు. తాగునీటి అవసరాలకు జలాశయం నుంచి 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

వనపర్తి రూరల్‌: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అఽధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 20న జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని.. కార్మికులు, రైతులు, కూలీలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వరాచారి, ఎండీ జబ్బార్‌, గోపి, లక్ష్మి, సాయిలీల, మదన్‌, బాలస్వామి, గంధం గట్టయ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగాబండలాగుడు పోటీలు

వనపర్తి రూరల్‌: మండలంలోని చిమనగుంటపల్లిలో లక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం గ్రామస్తులు అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు. మొత్తం 5 జతల ఎద్దులు పోటీలో పాల్గొనగా చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఎం.గోపాలకృష్ణ ఎద్దులు మొదటి బహుమతి గెలువగా రూ.40 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. అలాగే తాడూరు మండలం యాదిరెడ్డిపల్లికి చెందిన డా. అఖిలేష్‌రెడ్డి ఎద్దులు రెండో స్థానంలో నిలువగా రూ.30 వేలు, జ్ఞాపిక, నల్గొండ జిల్లా కొప్పోలు ఐతరాజు సత్యనారాయణ ఎద్దులు మూడోస్థానంలో నిలువగా రూ.20 వేలు, జ్ఞాపిక అందించారు.

భవిష్యత్‌ ఆయిల్‌పాం సాగుదే.. 1
1/1

భవిష్యత్‌ ఆయిల్‌పాం సాగుదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement