
సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గం
వనపర్తి రూరల్: సమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని.. పెట్టుబడిదారి విధానానికి విసిగిపోయిన ప్రజలు కమ్యూనిజం వైపు చూస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కారల్‌మార్క్స్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. కార్మికులు వందేళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి నిర్ణయించిన నేపథ్యంలో ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేయాలని.. రైతు రుణమాఫీ అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలాలు లేని వారికి ప్రభుత్వమే కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కేరళ తరహాలో పౌరసరఫరాలశాఖ ద్వారా రేషన్ కార్డుకు ఉన్న ప్రతి లబ్ధిదారుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, పుట్టా ఆంజనేయులు, లక్ష్మి, జీఎస్ గోపి, పరమేశ్వరాచారి, నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ