జిల్లా తపాలా కార్యాలయంలో నిలిచిన రైల్వే రిజర్వేషన్ సేవలు
ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నాం..
రిజర్వేషన్ కౌంటర్ లేకపోవడంతో ప్రైవేట్ ఇంటర్‌నెట్ కేంద్రాలను ఆశ్రయించి అదనంగా డబ్బులు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. జిల్లాకేంద్రమైన వనపర్తిలో ఉన్న కౌంటర్‌ను వినియోగంలోకి తేకపోవడం సరైంది కాదు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే రైల్వే ప్రయాణికులకు ఊరట కలుగుతోంది. – కంది వెంకటరమణ,
ప్రయాణికుడు, వనపర్తి
రైల్వే అధికారులకు
విన్నవించాం..
రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో కొంతకాలంగా సేవలు నిలిచిన మాట వాస్తవమే. కౌంటర్ నిర్వహణకు తలెత్తిన సాంకేతిక సమస్యలను సికింద్రాబాద్ రైల్వే అధికారులకు విన్నవించాం. వారు వచ్చి సమస్య పరిష్కరించాల్సి ఉంది. అప్పటి వరకు మేము ఏమీ చేయలేం. – భూమన్న,
పోస్టల్ సూపరింటెండెంట్, వనపర్తి
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కనిపిస్తున్నా.. సేవలు మాత్రం అందడం లేదు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా 12 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన రిజర్వేషన్ కౌంటర్‌లో ఏడాదిగా సేవలు నిలిచిపోయాయి. జిల్లాకేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి రోడ్, గద్వాల రైల్వేస్టేషన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు అధికంగా కొనసాగిస్తుంటారు. టిక్కెట్ రిజర్వేషన్ కోసం ఆయా స్టేషన్లకు వెళ్లి రావడానికి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో ప్రధాన తపాలా కార్యాలయంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభించారు. కొన్నేళ్ల పాటు బాగానే కొనసాగినా.. కరోనా ప్రారంభం నుంచి సేవలు తగ్గుముఖం పట్టాయి.
ఆదాయం ఇలా..
టిక్కెట్ విక్రయాలపై స్థాయిని బట్టి రైల్వేశాఖ తపాలాశాఖకు కొంత ఆదాయాన్ని అందిస్తూ వస్తోంది. స్వీపర్ క్లాస్ టికెట్‌పై రూ.15, ఫస్ట్, సెకండ్ ఏసీకి రూ.30. థర్డ్ ఏసీకి రూ.20 చొప్పున తపాలాశాఖకు ఆదాయం అందుతుండేది. దీంతో ప్రయాణికులకు సౌలభ్యం, రైల్వే, తపాలాశాఖకు ఆదాయం సమకూరేది. ఇటీవలి కాలంలో తీర్థయాత్రలు, వివిధ దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే వనపర్తి రోడ్ స్టేషన్‌లో లోకల్ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను నిలుపుతుండటం.. కర్నూలు, గద్వాల రైల్వేస్టేషన్లకు చేరేందుకు 1, 2 గంటల సమయం మాత్రమే పడుతుండటంతో టిక్కెట్ విక్రయాలు ఊపందుకునేవి. ప్రస్తుతం ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఉందో లేదో తెలియక ప్రయాణికులు డైలమాలో ఉన్నారు.
సేవల్లో అంతరాయం..
రిజర్వేషన్ కౌంటర్ నిర్వహణ బాధ్యతను ఓ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారు. తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు సేవలు కొనసాగడం, మరికొన్ని రోజులు నిలిచిపోయేవి. దీంతో చాలామంది ప్రయాణికులు కేంద్రానికి రావడం మానేశారు. రిజర్వేషన్ సేవలు సాఫీగా సాగేందుకు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా పెద్దగా శ్రద్ధ చూపలేదు.
ఆదాయం కోల్పోతున్న
రైల్వే, పోస్టల్ శాఖలు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కేంద్రం.. అలంకారప్రాయం!
కేంద్రం.. అలంకారప్రాయం!