పాన్‌గల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని.. ఉన్నత లక్ష్య ఛేదనకు నిరంతరం శ్రమించి పట్టుదలతో సాధించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం మండలంలోని మాందాపూర్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కనాలని.. వాటి సాకారం కోసం సమయాన్ని వృథా చేయకుండా ప్రయత్నించాలని సూచించారు. పది విద్యార్థులు వార్షిక పరీక్షలను భయంతో కాకుండా ఇష్టంతో రాసి ఉత్తమ జీపీఏ సాధించాలన్నారు. చెడు అలవాట్లు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ బృందం ఎస్పీని శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, జిల్లా విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్, గణేష్, ఎంఈఓ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జయరాములుసాగర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.