వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న జిల్లాకు రానున్నారని.. నియోజకవర్గంలో రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తోందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 11.8 కిలోమీటర్ల వరకు వెళ్లి వచ్చానని.. అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అక్కడికి సీఎం రాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నారని.. కొండగట్టులో 70 మంది, శ్రీశైలం పవర్ హౌస్‌లో 8 మంది, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో కార్మికులు చనిపోతే నాటి సీఎం కేసీఆర్ ఎక్కడికై నా వెళ్లారా అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సహా 11 సంస్థలను రప్పించి సహాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం ఘటన స్థలికి రాకపోయినప్పటికీ రోజూ సమీక్షిస్తున్నారని చెప్పారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మొదటిసారి వనపర్తికి రాబోతున్నారని.. తాను చదివిన పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 14 నెలల్లో రూ. వందల కోట్ల అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకొచ్చారని.. జాబ్‌మేళా, రుణమేళా, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర కార్యక్రమాలతో సుమారు వెయ్యి మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పని చేస్తున్నారన్నారు.
సీఎంకు వనపర్తితో అనుబంధం ఉంది..
సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తిలో చదువుకున్నందున ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఉందని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆయనతో పాటు చదువుకున్న వారితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.కోటి, రూ.257 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఆయన చదివిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని తెలిపారు. రూ.22 కోట్లతో ఐటీ టవర్, రూ.81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్, రూ.40 కోట్లతో రాజనగరం నుంచి పెద్దమందడి వరకు రహదారి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం హోదాలో జిల్లాకు తొలిసారిగా రేవంత్‌రెడ్డి రాక
ఎస్‌ఎల్‌బీసీలో భయానక పరిస్థితులు
రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు