
నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులదే కీలక పాత్రని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 12న రిటర్నింగ్ అధికారుల శిక్షణలో నామపత్రాలు స్వీకరించే రోజు నుంచి స్కూట్రీని, విత్‌డ్రా, గుర్తులు కేటాయింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలు, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల నిబంధనలు క్షుణ్ణంగా అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలన్నారు. నామినేషన్ గదిలోకి అభ్యర్థి, ప్రతిపాదకుడు, మరో వ్యక్తిని మాత్రమే అనుమతించాలని సూచించారు. నామినేషన్ సరిగా సమర్పించేలా అవగాహన కల్పించాలని.. నామపత్రంలో ఏమైనా తప్పులు, లోపాలుంటే పరిశీలించి నోటీస్ ఇవ్వాలన్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.5 వేలు, ఎంపీటీసీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వివరించారు. సర్పంచి, వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థుల పేర్లు సంబంధిత గ్రామపంచాయతీ ఓటరు జాబితాలో తప్పక ఉండాలని, అదే జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు తప్పనిసరి కాదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ సురేశ్‌కుమార్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 46 దరఖాస్తులు వచ్చాయని.. సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులకు సిఫారస్ చేసినట్లు వివరించారు. సీఎం ప్రజావాణి, కలెక్టరేట్ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి