
వనపర్తి క్రైం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని.. ప్రజలు, మేధావులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్‌గాంధీకి కోర్టు శిక్షవేసి అప్పీల్‌కు నెలరోజుల గడువు ఇచ్చినా.. ఆఘమేఘాల మీద లోక్‌సభ సభ్యత్వాన్ని, నివాసం కూడా ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాహుల్ కర్ణాటకలో విమర్శలు చేస్తే గుజరాత్ కోర్టులో దావా వేయటం, జడ్జి ఏడాది చాలదంటూ వ్యాఖ్యానిస్తూ రెండేళ్లు శిక్ష విధించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షగట్టి సీబీఐ, ఈడి కేసులు నమోదు చేయించడం దుర్మార్గమన్నారు. కరోనా సమయంలో అన్ని కంపెనీలు నష్టపోయినా.. అదానికి మాత్రం రోజుకు రూ.1,620 కోట్ల ఆదాయం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14, 15 తేదీల్లో నిర్వహించే పాదయాత్రలో ప్రజలకు ఈ విషయాలు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయరాములు, నాయకులు అబ్రహం, రాబర్ట్, మోష, కుర్మయ్య, రవీందర్, రమేష్, కుతుబ్ తదితరులు పాల్గొన్నారు.