వనపర్తిటౌన్: మౌఖిక ఫిర్యాదులతో ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ప్రభుత్వంలో రాతపూర్వకంగా ఇస్తేనే విలువ ఉంటుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కౌన్సిలర్లకు సూచించారు. మంగళవారం జరిగిన పుర బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కౌన్సిల్ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పేపర్‌పై రాస్తేనే సంబంధిత అధికారులు తగిన సమయంలో చర్యలు తీసుకుంటారని తెలిపారు. తైబజార్‌కు సంబంధించి ఎంతమంది నుంచి ఎంత వసూలు చేశారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. సుమోటోగా స్వీకరించి ప్రత్యేక విచారణ అధికారిని నియమించి విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రతి వారం పుర అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని.. కౌన్సిలర్లు కలిసి సమస్యలు ఉంటే చెప్పాలని వివరించారు. పుర ఆదాయ, వ్యయాలపై కౌన్సిలర్లు అవగాహన పెంచుకోవాలని సూచించారు. అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఆస్తిపన్ను వసూలు లక్ష్యం చేరుతుందని వివరించారు. మున్సిపాలిటీకి ఆదాయం రావాలనే ఆశయంతో జరుగుతున్న అవినీతి, లోపాలను కౌన్సిలర్లు ప్రశ్నించడం బాగుందని.. ఇదే తరహాలో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాకేంద్రంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టామని.. త్వరలోనే పరిష్కారం కానుందన్నారు. పుర చైర్మన్ గట్టుయాదవ్ మాట్లాడుతూ.. అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడితే పురపాలికను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.
తాగునీరు, తైబజార్‌పై రభస..
పురపాలికలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కౌన్సిలర్లు పాకనాటి కృష్ణ, బండారు కృష్ణ, నక్కరాములు, నాగన్నయాదవ్, లక్ష్మీనారాయణ, బ్రహ్మం, బాషానాయక్ తదితరులు సభ దృష్టికి తెచ్చారు. అయిదు రోజులకు ఓసారి తాగునీరు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. డీఈ సూర్యనారాయణ, ఏఈ హేమలత మిన్నుకుండగా, మొదటి ఏఈ భాస్కర్ మాట్లాడుతూ.. డ్యాంలో మోటార్లు చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి గోపాల్‌పేటకు డౠ్ల్యపీటీ పూర్తయిందని, ట్రయిల్ రన్ నడుస్తోందని, త్వరలోనే రామన్‌పాడు నుంచి గోపాల్‌పేటకు వెళ్లే నీటిని వనపర్తికి మళ్లిస్తారని వివరించారు. ఏళ్లుగా తైబజార్ ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదని, తైబజార్ సొమ్ము ఎటు పోతుందో అధికారులకే తెలియడం లేదని, పుర ఆదాయానికి భారీగా గండి పడుతోందని పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. లేఅవుట్ల అనుమతుల్లో నిబంధనలు పాటించడం లేదని కాంగ్రెస్ సభ్యుడు రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్, కమిషనర్ విక్రమసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలుంటే కలిసి విన్నవించాలి
పుర బడ్జెట్ సమావేశంలో
కౌన్సిలర్లకు కలెక్టర్ సూచన