● రెండిళ్లల్లో బంగారం,
వెండి ఆభరణాల అపహరణ
పార్వతీపురం రూరల్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దొంగలు పంజా విసిరారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెండు వేర్వేరు చోట్ల భారీ చోరీలకు పాల్పడ్డారు. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకేఎం కాలనీలో మత్స తవిటమ్మ అనే మహిళ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గేట్ తాళాలు పగులగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న తులం బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎం. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే పట్టణంలోని చర్చి వీధిలో గల దేశెట్టి రామారావు ఇంట్లో సుమారు 4 తులాల బంగారం చోరీకి గురైంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వీరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణ సీఐ బి. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.


