మాజీ సీఎస్ పర్యటనలో ఆంతర్యమేమిటో?
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం సందర్శించారు. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రితో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా దిగువనున్న ప్రధాన ఆలయాన్ని సందర్శించి.. ఆలయ అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు. అనంతరం నీలాచల పర్వతంపై ఉన్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. గతంలో బోడికొండపై చోటుచేసుకున్న కోదండ రాముడి విగ్రహ ధ్వంసం ఘటన అనంతరం ప్రతిష్టించిన నూతన విగ్రహాల నిర్వహణ, ఆలయంలో ఉన్న పాత విగ్రహాల గురించి ఆరాతీసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. పాత విగ్రహాలు ఇంత కాలం ఎందుకు ఆలయంలో ఉంచారని శాస్త్రి ప్రశ్నించగా.. దర్యాప్తు కారణంగా ఉంచాల్సి వచ్చిందని ఆలయ అధికారులు, అర్చకులు సమాధానం ఇచ్చారు.
పర్యటన ఉద్దేశమేమిటో?
రామతీర్థంలో మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి పర్యటన ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు మీడియాకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. స్థానిక ప్రసాద నివేదన తయారీ మండపంలో సుమారు అర్ధ గంటపాటు ఆలయ అధికారులు, అర్చకులతో చర్చించారు. అశోక్ బంగ్లాకు శుక్రవారం రావాలని వారికి సూచించినట్లు తెలిసింది. వారి వెంట ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, మల్లిఖార్జునశర్మ, తదితరులు ఉన్నారు.


