డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి అత్మహత్య
కొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల ఒక డిఫెన్స్ అకాడమీలో ఇంటర్‌మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్(16) తీవ్రమైన తలనొప్పితో బాధ భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్.షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ స్థాని డిఫెన్స్ అకాడమీలో ఇంటర్‌మీడియట్‌లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చేరాడు. కాగా కొద్ది నెలలుగా వికాస్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటూ తోటి విద్యార్థులు తెలిపారు.ఈ క్రమంలో బుధవారం మరోమారు తీవ్రమైన తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్‌లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని చెప్పగా ఇప్పడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటిరోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. కాగా తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా హాస్టల్ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఊరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్‌కు వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందికి దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఒక్కగానొక్క కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తండ్రి లబోదిబోమంటూ రోదించాడు.


