జాతర ఖర్చుల సంగతేంటి?
● సమన్వయ సమావేశంలో ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు
● స్పందించని ఎమ్మెల్యే కళావెంకటరావు, ఆలయ కమిటీ
చీపురుపల్లి: కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర నిర్వహణకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది.. ఆ డబ్బులను ఎక్కడి నుంచి పోగుచేస్తారో ఆలయ కమిటీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో గురువారం జరిగిన జాతర సమన్వయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గద్దే బాబూరావు ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే ‘కళా’తో సహా ఆలయ కమిటీ సభ్యులు ఒక్కరూ స్పందించలేదు. సమాధానం ఇవ్వలేదు. అక్కడే ఉన్న దేవదాయశాఖ ఈఓ తమ శాఖ నుంచి రూ.15 లక్షలు ఇస్తామని వెల్లడించారు. మిగిలిన డబ్బు గురించి ఆయన పదేపదే ప్రశ్నించినా సమాధానం లేకపోవడంతో ఎమ్మెల్యే, కమిటీ సభ్యులే జాతర నిర్వహణ చూసుకోవాలంటూ ప్రసంగాన్ని ముగించారు.
జాతర విజయవంతానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.శంకరావు, తహసీల్దార్ డి.ధర్మరాజు, ఎంపీడీఓ ఐ.సురేష్, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


