‘ఉపాధి’ పథకానికి గాంధీ పేరు మార్చకూడదు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చకూడదని డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఆసరాగా ఉంటూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసిందన్నారు. అలాంటి పథకాన్ని ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నెలనెలా అప్పులు చేస్తోందని, మరి ఏ విధంగా 40 శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం భరించగలదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామసభల ద్వారా గ్రామాలకు ఏం కావాలనే నిర్ణయం తీసుకునేవారని, కొత్త చట్టంలో గ్రామాల్లో చేపట్టే పనులు ఢిల్లీలో నిర్ణయిస్తారట అని ఎద్దేవా చేశారు. జిల్లా నుంచి వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, ఐశ్వర్య, రామచంద్రరాజు, తిరుపతి, దుర్గాప్రసాద్, కరీం, రామారావు, శ్రీనివాస్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్


