మా ఊరు.. మా భూమి.. మా హక్కు | - | Sakshi
Sakshi News home page

మా ఊరు.. మా భూమి.. మా హక్కు

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

మా ఊర

మా ఊరు.. మా భూమి.. మా హక్కు

విజయనగరం గంటస్తంభం: భూమి అంటే కేవలం ఎకరాల లెక్క కాదు... అది రైతు జీవితం.. పిల్లల చదువుల ఆశ.. వృద్ధులకు భరోసా.. అలాంటి భూములను ఐటీపార్క్‌ పేరుతో లాక్కోవాలన్న తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం కలెక్టరేట్‌ వద్ద రైతులు సోమవారం ఆందోళన చేశారు. డెంకాడ గ్రామ పోరాట కమిటీ ఆధ్వర్యంలో డెంకాడ, పెడాడ, బంటుపల్లి, గుణుపూరు గ్రామాలకు చెందిన రైతులు ‘మా భూమి మా హక్కు’ అంటూ నినదించారు. ప్రాణాలు తీసినా భూమిని ఇచ్చేదిలేదంటూ జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు మహిళలు, రైతులు, కూలీలు ర్యాలీ నిర్వహించారు. ఏపీఐఐసీ ప్రతిపాదించిన ఐటీ పార్క్‌కోసం 100 శాతం జిరాయితీ సాగుభూముల సేకరణ రైతు జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సుమారు వెయ్యి మంది చిన్న, సన్నకారు రైతులకు చెందిన వెయ్యి ఎకరాల భూములు కోల్పోతే వలసతప్పదంటూ వాపోయారు. డెంకాడ ఓపెన్‌ హెడ్‌ చానెల్‌, గొడ్డుపాలెం రిజర్వాయర్‌ నీటితో రెండు పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. సాగుభూములు కోల్పోతే ఉపాధి, జీవితం రెండూ దెబ్బతింటాయని, అభివృద్ధి పేరుతో రైతులను నష్టపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పుడు సాగు భూములను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టారు. భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పేద రైతుల కన్నీళ్లపై నడిచే తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి మోడల్‌కు నిదర్శనమని నాయకులు విమర్మించారు. రైతు చేతిలో ఉన్న భూమిని లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టడమే అభివృద్ధి అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ ఆందోళనకు వామపక్ష పార్టీలైన సీఐటీయూ, సీపీఐ, ఏఐటీయూసీ సంఘీభావం ప్రకటించాయి. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ రాజు, వైఎస్సార్‌సీపీ నాయకుడు రొంగలి కనక సింహాచలం, నాని రాజు, సిరికి అప్పారావు, రైతులు పాల్గొన్నారు.

ఐటీపార్క్‌ ముసుగులో రైతుల భూముల దోపిడీ వద్దు

టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా

రైతుల ఆందోళన

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

మా ఊరు.. మా భూమి.. మా హక్కు 1
1/1

మా ఊరు.. మా భూమి.. మా హక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement