టీడీపీలో పరువు కరువు
● ఎస్.కోటలో ప్రొటోకాల్ కుంపటి
● కనీస గౌరవం లేదంటూ మీడియా ముందు వాపోయిన టీడీపీ నాయకులు
శృంగవరపుకోట: మాకు రెస్పెక్ట్ లేదా.. మాకు రెస్పెక్ట్ ఇవ్వారా.. అంటూ పలువురు టీడీపీ నాయకులు ఎస్.కోట వేదికగా సోమవారం గగ్గోలుపెట్టారు. టీడీపీలో పరువు కరువైందంటూ వాపోయారు. ఎస్.కోటలో ఆస్పత్రి భవనాల ప్రారంభోత్సవానికి ఆరోగ్యశాఖ మంత్రి, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రులు వచ్చారు. దీనికి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులకు పిలుపు అందలేదు. దీనిపై ఎంపీపీ సోమేశ్వరరావు, మాజీ ఎంపీపీ అప్పారావు, తదితరులు మీడియాతో మాట్లాడుతూ ‘నాడు ఐ.వి.ఎన్.రాజు హయాంలో, తర్వాత ఒంటి అప్పారావు నేతృత్వంలో ఆస్పత్రి భవనాలకు ఎంపీడీఓ కార్యాలయం స్థలం ఇచ్చాం... భవనాల ప్రారంభోత్సవానికి అధికారుల నుంచి కనీసం పిలుపు అందలేదు.. ప్రొటోకాల్ పాటించలేదు.. మేము రాజ్యాంగం ప్రకారం ఎన్నికై న వాళ్లం కాదా’ అంటూ వాపోయారు. ఇంతటి దౌర్బాగ్య స్థితి ఎక్కడా ఉండదని, పార్టీలో చేరినప్పుడు రండి..రండి అంటూ ఇప్పుడు పొమ్మని పొగపెడుతున్నారని వాపోయారు.
ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవానికి డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణకు కూడా పిలుపు అందలేదు. ఆహ్వాన పత్రికల్లో ఆయన పేరు ప్రస్తావించలేదు. ఫ్లెక్సీలలో ఎక్కడా ఆయన ఫొటో లేదు. దీనిపై ఆయన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో, రాత్రికి రాత్రే శిలాఫలకంపై గొంప కృష్ణ పేరును ఇరికించారు.


