టీడీపీ నాయకుల దాడులు, దుష్ప్రచారాలపై చర్యలు తీసుకోండి
● పోలీసులకు వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు
బొబ్బిలి: రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి దుష్ప్రచారంపై విచారణ సంస్థలు, సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ టీడీపీ కూటమి నాయకులు అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్రంలోని ప్రజలు, భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఒకరిపై మరొకరు పోస్టులు, వాగ్వాదాలు, ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ, మండలాధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, తమ్మిరెడ్డి దామోదరరావు పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని బొబ్బిలి సీఐ కె.నారాయణరావుకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మాజీ మంత్రులు, నాయకుల ఇళ్లపై సైతం దాడులు చేస్తున్నారని, ఇది సహేతుకం కాదన్నారు. ఇటువంటి దురాగతాలు, దాడులు, దుష్ప్రచారాలు ఇక కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి బొద్దల సత్యనారాయణ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు నడిమింటి సత్యం నాయుడు, న్యాయవాది రుంకాన ప్రసాదరావు, తాట్రాజు రామకృష్ణ, గొట్టాపు సూర్యనారాయణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


