7న ముఖ్యమంత్రి వన్నలి రాక !
● స్థల పరిశీలనలో అధికారులు
రేగిడి: మండలంలో ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్నట్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.ప్రమీలాగాంధీ తెలిపారు. వన్నలి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు సభాస్థలంతో పాటు హెలిప్యాడ్ స్థలాన్ని తహసీల్దార్ ఐ.కృష్ణలతతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి ఆదేశాలతో గ్రామాన్ని పరిశీలించేందుకు వచ్చామన్నారు. పర్యటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఆమె వెంట డీటీ బి.ఈశ్వరరావు, ఆర్‌ఐ కె.గిరి, సర్వేయర్ చంద్రరావు, విలేజ్ సర్వేయర్ గంగాధరరావు, పంచాయతీ కార్యదర్శి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్–1లో మెరిసిన ‘మెస్సీ’
విజయనగరం అర్బన్: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో డెంకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్.సహజ మెస్సీ ఇవాంజెలిన్ విజేతగా నిలిచారు. ఆమె జిల్లా ఉపాధి అధికారిగా నియామకమయ్యారు. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె 2019లో విజయనగరం మండలం దుప్పాడ గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తండ్రి ఆర్‌ఏఎస్ కుమార్ జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా, తల్లి కె.శోభారాణి జిల్లాలోని బొండపల్లి ఎంఈఓ–1గా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం, స్వయం కృషితో విజయం సాధించినట్టు ఆమె తెలిపారు.
మా జీవనాధారం లాక్కోవద్దు
● మంత్రి కొండపల్లికి భోగాపురం రైతుల విజ్ఞప్తి
విజయనగరం అర్బన్: అభివృద్ధి పేరుతో జీవనాధారమైన సాగుభూములను లాక్కోవద్దని భోగాపురం మండలంలోని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను శనివారం కలిసి గోడు వినిపించారు. ఇప్పటికే విమానాశ్రయం కోసం చాలావరకు భూములు ఇచ్చామని, మళ్లీ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో ఉన్న కాస్త భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను వదులుకునేందుకు సిద్ధంగాలేమని స్పష్టంచేశారు. వినతిపత్రం అందుకున్న మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే కలెక్టరేట్‌లోకి వెళ్లిపోవడంతో రైతులు ఆవేదన చెందారు.
మౌలిక హక్కులకు దూరంగా వీధిబాలలు
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్
విజయనగరం ఫోర్ట్: వీధి బాలలు విద్యా, ఆరోగ్యం, పోషణ, రక్షణ వంటి మౌలిక హక్కులకు దూరంగా ఉంటున్నారని జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా శనివారం వీటీ ఆగ్రహారంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలకార్మికత్వం, దోపిడీ, హింసకు గురవుతున్నారు. ప్రతి బాలుడికి సురక్షితమైన జీవితం, విద్య, ప్రేమతో కూడిన వాతావరణం కల్పించడం సమాజం సామూహిక బాధ్యతగా పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాశాఖ, ప్రజలు కలిసి వీధి బాలల పునరావాసం, విద్యా అవకాశాలు, ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ కో ఆర్డినేటర్ సీహెచ్ జగన్‌మోహన్, ఎంఈఓ ఆనందమూర్తి, వీటీ ఆగ్రహారం హైస్కూల్ హెచ్‌ఎం లూథర్, తదితరులు పాల్గొన్నారు.
7న ముఖ్యమంత్రి వన్నలి రాక !
7న ముఖ్యమంత్రి వన్నలి రాక !
7న ముఖ్యమంత్రి వన్నలి రాక !


