భూ రికార్డుల్లో తప్పులవల్లే రైతులకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల్లో తప్పులవల్లే రైతులకు ఇబ్బందులు

Jan 30 2026 6:40 AM | Updated on Jan 30 2026 6:40 AM

భూ రికార్డుల్లో తప్పులవల్లే రైతులకు ఇబ్బందులు

భూ రికార్డుల్లో తప్పులవల్లే రైతులకు ఇబ్బందులు

ఈకేవైసీ పరిశీలించాకే పాస్‌పుస్టకాలు ప్రింటింగ్‌కు ఇవ్వాలి

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

బొబ్బిలి:

క్షేత్రస్థాయిలో రైతుల భూములకు ఈకేవైసీ చేయించాక, సరిచూసుకున్నాకే పట్టాదారు పాస్‌పుస్తకాలను ప్రింటింగ్‌కు ఇవ్వాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందరరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ కళాభారతి మున్సిపల్‌ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భూ సమస్యలులేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ అధికారులంతా సంసిద్ధం కావాలన్నారు. భూ రికార్డుల్లో తప్పులు ఉండడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో 499 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, 423 గ్రామాల్లో 2.03 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. సుమారు 8,015 పాస్‌ పుస్తకాలకు 3,896 పుస్తకాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. తప్పులు సరిదిద్ది ఫిబ్రవరి 10లోగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతినెలా 2 నుంచి 9వతేదీ లోగా రికార్డులు సరిదిద్దే చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీలను పది రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో పలు సమస్యలకు కారణమైన జాయింట్‌ ఎల్‌పీఎంలను సరిదిద్దాలన్నారు. జేసీ సేతుమాధవన్‌ మాట్లాడుతూ పాస్‌ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దేందుకు తాజాగా తహసీల్దార్లకు, ఆర్డీఓలకు అధికారం అప్పగించామన్నారు. సమావేశంలో ఆర్డీఓ జేవీవీఎస్‌ రామ్మోహనరావు, సర్వే ఏడీ విజయకుమమార్‌, బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం తహసీల్దార్లు ఎం.శ్రీను, వరప్రసాద్‌, అజూ రఫీజాన్‌, జి.హేమంత్‌ కుమార్‌, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

మెట్టవలస సచివాలయం సందర్శన

బొబ్బిలి రూరల్‌: మండలంలోని మెట్టవలస సచివాలయాన్ని కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి గురువారం సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి పలు అంశాలపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఆర్‌ఎస్‌కే, వెల్‌నెస్‌ సెంటర్‌, సచివాలయ సిబ్బంది విధుల తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈకేవైసీ, రీసర్వే ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement