ప్రాణాలు తీసినా భూములు ఇవ్వం
● స్పష్టం చేసిన భోగాపురం, ముంజేరు రైతులు
● భూసేకరణ నిలిపివేయాలంటూ
తహసీల్దార్‌కు వినతి
భోగాపురం: మా ప్రాణాలు తీసినా సరే ప్రభుత్వానికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని భోగాపురం, ముంజేరు గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. బలవంతంగా నోటికాడ కూడును లాక్కో వద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఐటీపార్క్, డేటా సెంటర్, ఎడ్యుకేషన్ హబ్‌ల పేరుతో భూసేకరణ కోసం చేపడుతున్న సర్వేలను వ్యతిరేకిస్తూ రైతులందరూ కలిసి గురువారం నిరసన తెలిపారు. సర్వేలను నిలిపివేయాలంటూ సర్పంచ్ పూడిక నూకరాజుతో కలిసి తహసీల్దార్ రమణమ్మకు వినతిపత్రం అందజేశారు. తరతరాలుగా వరి, వేరుశనగ, కొబ్బరి తోటలు సాగుచేస్తూ సాగిపోతున్న మా జీవితాల్లో ప్రభుత్వం భూసేకరణ పేరుతో చిచ్చు పెడుతోందని వాపోయారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సుమారు మూడువేల ఎకరాల భూములను ఇచ్చామని, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అక్కడ ఎవరికీ ఉపాధి కల్పించలేదని, ఇప్పుడు మళ్లీ అభివృద్ధి కంపెనీల ఏర్పాటు పేరుతో ఉన్న భూములను లాక్కోవడం అన్యాయమని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా భూములకు కొట్లాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా మట్టిని నమ్ముకున్న మేము భూమిని మాత్రం అమ్ముకోలేదని, అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలు, బలవంతపు సేకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభు త్వం కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యం కాదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వినతిపత్రంలో పేర్కొన్నారు.


