సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి.. కూటమి కుట్ర!
విజయనగరం అర్బన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించేలా... ఊరిపొలిమేర దాట కుండానే ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ అందేలా గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థపై కూటమి కక్షగట్టింది. నిర్వీర్యం చేసేందుకు కుట్రపూనింది. ఉద్యోగులను వివిధ సర్వేల పేరుతో వేధింపులకు గురిచేస్తోంది. వారి సమస్యలను పట్టించుకోకుండా... సదుపాయాలు కల్పించకుండా ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు సచివాలయాల కుదింపుతో పాటు మిగులు ఉద్యోగుల పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలపై సచివాలయ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సర్వేయర్లు ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు మిగిలిన విభాగాల ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
వ్యవస్థను నీరుగార్చేలా...
ప్రజల ఇంటి ముందే పాలన అనే భావనతో 2019–20 మధ్య ఏర్పాటైన సచివాలయ వ్యవస్థను 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా మార్పులు చేస్తోంది. రేషనలైజేషన్ పేరుతో సిబ్బంది సర్దుబాట్లు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 777 పంచాయతీలకు సంబంధించి 626 సచివాలయాలు ఉండగా 5,781 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్, ఫేషియల్ అటెండెన్స్, పేరు మార్పు వంటి సంస్కరణలు సేవలకు మెరుగు పరుస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రజలు, ఉద్యోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత పాలక పక్ష ఎమ్మెల్యేల వాఖ్యలు, ప్రఽభుత్వం చేపడుతున్న విధాన మార్పులు, వ్యవస్థను నిర్వీర్యం చేసేలా మారాయి. సిబ్బంది, సచివాలయాల రేషనలైజేషన్ చర్యలతో వ్యవస్థపై ప్రభుత్వానికి స్పష్టమైన దృక్పథం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిబంధనల కత్తి...
2,500 మంది కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో 6 మంది, 3,500 వరకు ఉంటే 8 మంది ఉద్యోగులే పనిచేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. రేషనలైజేషన్ పేరుతో అన్ని కేటగిరీలు కలిపి జిల్లాలో వెయ్యమందిని మిగులు చూపారు. వాళ్లను మరో శాఖలకు పంపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 140 మంది మిగులు ఉద్యోగులతో దేవదాయ శాఖలో ఖాళీలను భర్తీచేయాలని తాజాగా జీఓ కూడా విడుదల చేసి తొలిప్రయత్నంగా ప్రకటించింది. బదిలీలు, ప్రమోషన్లలో అన్యాయాలు, అధికారుల వేధింపుల వల్ల ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి పెరిగాయని కొందరు ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.
ఉద్యోగుల గౌరవంపై దాడే
సచివాలయాలు, సిబ్బంది కుదింపు చర్యలు
మిగులు ఉద్యోగులపేరుతో
ఇతర శాఖలకు సర్దుబాటు యత్నాలు
సచివాలయాలు దరిద్రాలయాలుగా వ్యాఖ్యలు
కూటమి తీరును దుమ్మెత్తిపోస్తున్న
ఉద్యోగులు
ప్రభుత్వ సేవలను ప్రజల దరిచేరుస్తూ కీలక పాత్ర వహిస్తున్న సచివాలయ/వార్డు సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టంచుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వాలు తమ అన్ని కార్యక్రమాలను సచివాలయ సిబ్బందిచే అమలు చేయించుకుంటూ మరోవైపు వారిని, ఆ వ్యస్థను అవమానించే వ్యాఖ్యలను ప్రభుత్వం ఉపేక్షించడం సరైన పాలనాధోరణి కాదు. ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజాసేవ వ్యవస్థపై ప్రజల్లో అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నారు. – బూసర్ల శ్రీను,
జిల్లా అధ్యక్షుడు, అర్బన్ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి.. కూటమి కుట్ర!
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి.. కూటమి కుట్ర!


