విద్యుత్ పొదుపు ప్రగతికి మార్గం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్‌అండ్‌బీ జంక్షన్, మయూరి జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే, అంత అదనంగా ఉత్పత్తి చేసినట్లునన్నారు. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దీనికోసం విద్యుత్‌ను ఆదా చేసే 5స్టార్ పరికరాలను వినియోగించాలని సూచించారు. అవసరమైనప్పడు విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని కోరారు. తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకుని విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. విద్యుత్‌ను వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, ఈఈలు పి.త్రినాథరావు, జి.సురేష్‌బాబు, బి.రఘు, ఏడీఈ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
పార్వతీపురం: ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ ఇంధనపొదుపు వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు కచ్చితంగా అమలు కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాలు, సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేసేలా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించారు. గత నెలలో విద్యుత్ బిల్లు ఆదారంగా వీలైనంతవరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని కోరారు. విద్యుత్‌ను ఆదా చేయడమంటే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించి నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, పొదుపు చేయడం తదితర అంశాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపు ప్రగతికి మార్గం


