జాతీయస్థాయి పోటీలకు కంచరాం విద్యార్థి
రాజాం సిటీ: మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అలజంగి సంతోషిణి జాతీయస్థాయి పెంటాథ్లాన్ పోటీలకు ఎంపికై ందని పీడీ టి.దుర్గారావు, పీఈటీ బి.నారాయణనాయుడులు సోమవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎంపికై ందన్నారు. విద్యార్థిని ఎంపికపట్ల హెచ్‌ఎం వీవీ వసంతకుమార్‌తోపాటు పాఠశాల స్టాఫ్ కార్యదర్శి మజ్జి మదన్‌మోహన్, ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై ఎటీడబ్ల్యూఓ విచారణ
సాలూరు: మండలంలోని కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆదివారం ఫినాయిల్‌తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై ఏటీడబ్ల్యూఓ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆమె పాఠశాలకు వెళ్లి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడారు.ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆమె తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని ఒకరికి గాయాలు
పాచిపెంట: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పాచిపెంట మండలంలోని పణుకువలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి సత్యనారాయణ(35) రామభఽధ్రపురం మండల కేంద్రంలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం ప్రతిరోజూ రామభధ్రపురం వెళ్లి వస్తూ ఉంటాడు. రోజులాగానే ఆదివారం పని ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ కృష్ణారావు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజాం సిటీ: మండల పరిధి ఇప్పిలిపేట సమీపంలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టొంపల సుమంత్ (26) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజాంలో విధులు ముగించుకుని స్వగ్రామమైన గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఇప్పిలిపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌ను స్థానికులు రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వివరించారు.
చికిత్స పొందుతూ మరో వ్యక్తి..
గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజయనగరంలోని కణపాకకు చెందిన కోరాడ పైడిరాజు ఈనెల 12వతేదీన ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా రామవరం పప్పుల మిల్లు వద్ద నరవ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌తో వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. సాయికృష్ణ తెలిపారు.
మర్మాంగాన్ని కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడు
బొబ్బిలి: విశాఖకు చెందిన మతిస్థిమితం లేని ఓ యువకుడు తన మర్మాంగాన్ని సోమవారం రాత్రి కోసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల కథనం ప్రకారం స్థానిక ఫ్‌లైఓవర్ వద్ద ఓ యువకుడు కాళ్ల వెంబడి రక్తమోడుతూ తిరుగుతుండడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారమందించారు. అంబులెన్స్‌లో ఎక్కేటప్పుడు ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు గడియకోమాట చెబుతూ అర్థంలేని విధంగా ప్రవర్తించాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్సకూ ఇబ్బందులు పెట్టాడు. ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి జి.శశిభూషణ రావు పరీక్షించి విశాఖ రిఫర్ చేశారు. ఈ లోగా యువకుడు చెప్పిన మేరకు సమాచారం అందడంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులు కూడా బొబ్బిలి చేరుకున్నారు. యువకుడిని చికిత్స నిమిత్తం వెంట తీసుకెళ్లారు.


